చిన్న నాటి అందమైన జ్ఞాపకాలు

చూసొద్దామని వేళ్లా మా ఊరికి
చిన్ననాటిని నెమరువేసుకుంటూ
 
తాటాకు ఇల్లు
కిక్కీస దడులు
 
ఓ పక్క పంట కాలువ
మరో పక్క పచ్చని చేలు
 
ఇంటినెకనుండి
ఎప్పుడూ ఈవో పక్షుల
ఇకఇకలు, పకపకలు.
 
ఏంటో
ఏ కాలమైనా, ఏదొక పండు
రాలి పడుండేది ఆ పెరటిలో
 
ప్రకృతిలో
పొద్దుగూకులు
ఆడి ఆడి
అలసిని దేహానికి
పక్కెక్కిన వెంటనే
ఆవహించేది గాఢ నిద్ర
 
నిద్రలో కాలం పరుగులెడుతుందేమో
మొద్దు నిద్రగా, ఇట్టే తెల్లారిపోయేది.
 
గుమ్మం తలుపు సంధుల నుండి
సూర్య కిరణాలు తొంగి చూస్తూ
లేవరా అంటూ నాకు చురకలంటించేవి.
 
మసక కన్నులు తుడుచుకుంటూ
అడుగు బయట పెడితే,
అప్పటికే
తెల్లారిందో.. అని కోడి పుంజులు అరుస్తుండేవి.
దొడ్డిలోని లెగదూడ చెంగుచెంగున గంతులేస్తుండేది.
కాకులన్ని రుచులు చూడ ఇంటింట
వంటిటి కొప్పు పై ఎదురు చూస్తుండేవి.
 
వేప పుల్ల విరిచి నములుతూ
ఊరిలో షికారులు
 
తిరిగొచ్చేసరికి పెసరట్టు గుమగుమలు
నాలుగట్లు అట్టా గుటకేసి
ఓ గ్లాసుడు ఆవు పాలు
గొంతులో పోసి
ఆటలంటూ పరుగు పరుగు
 
మిట్ట మధ్యాహ్నమయ్యేది తిరిగొచ్చే సరికి
కుండ నీరు గొంతు తగలగా వొళ్ళు జల్లు మనేది.
 
అమ్మమ్మా
తినడానికేమన్నా
అని అన్నంతనే
పరుగు పరుగున వెళ్లి
అన్నీ చెంగున చుట్టి
తెచ్చి నా ముందేట్టేది.
 
చిరు తిండ్ల నిధి
వేశవికి నాకోసం సిద్దమై వుండేది.
 
ధవడలు అలిసే దాకా
నమిలి నమిలి ఆపే వాడిని
 
హమ్మయ్య అనుకుని
పెరట్లో ఆ నులక మంచంమీద
ఓ కునుకు పాటు తీసే వాడిని...
 
మళ్ళీ సూర్యుడు ఎర్రబడ్డాక లెగిసి
ఓ గుక్కెడు తెనీరు మింగి
అటు ఇటు కుప్పి గంతులు వేసొచ్చేవాడిని
 
పొద్దు గూకేది.
నాలుగు మెతుకులు మింగి
ఆ చల్ల గాలికి
మరో నాలుగు అడుగులు అటు ఇటు వేసి
తాతయ్యతో ముచ్చట్లు పెట్టి
ఓ మంచి నీతి కథ ఆలకించి
ఊహాల లోకంలోకి
హంస నావలో ప్రయాణం మొదలు పెట్టేవాడిని.
 
అక్కడున్న రోజులన్నీ
గమ్మత్తుగా గడిచిపోయేవి
అప్పుడేనా  తిరుగు ప్రయాణం అన్నంతగా.
 
అక్కడే
పడితే లెగడం నేర్చుకున్నా
ఓడినా నవ్వడం నేర్చుకున్నా
ధర్మాధర్మాలు తెలుసుకున్నా
నిజానికి
నిజమైన చదువు నేర్చింది అక్కడే నేను
 
ఆ క్షణాలు ఇంకా నా కన్నుల్లో కలలై
ప్రతి రాత్రి నన్ను పలకరిస్తు నే వుంటాయి.

సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
0
+1
0
+1
0
+1
0

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don`t copy text!