నిద్రకు వేళాయే
నేటికీ కాలం చెల్లి అలిసింది నా కన్ను
ఇక వాలిపోతానని తెగ పోరెడుతుంది
పగలంతా తెగ పాకులాడిన కట్టె
చీకటయ్యే సరికి ఆరడుగుల పడకపై పడింది
ఆశలు లేవిక, ఆదమరిచా తెలిసినదంతా
అలిసిన నా దేహం సెలవు కోరుకుంటుందిక
వెచ్చని మట్టి కప్పుకుని పడుకున్నా
ఇప్పుడు నన్ను కదిపేవారు లేరెవ్వరు
ఇకపై నాతో పోటీకి రారెవ్వరు
దీని కోసమేనా ఆగకుండా తీసిన నా పరుగు
దీని కోసమేనా మోయలేక మోసిన బరువు
నను మోసిన పేగు బంధపు ఋణం తీరిపోయినది
కట్టుకున్న తాడు బందం బలహీనపడి తెగిపోతున్నది
చీకటిలో నిశ్యబ్దంతో స్నేహం మొదలైనది
ఆహః ఏమీ అనుభూతి.
స్వర్గముపై లోకమిది. మోక్షానికి మించినదిది.
దీన్ని తలిచా బయపడినది.
మూర్ఖుడిని నేను, బలవంతంగా నెమ్మదించా.
నా స్వేచ్ఛకు నేనే సంకెల్ళేసుకు కూర్చున్నా…
హః హః…
ఇదీ వాడి లీలేనేమో
పరమార్థపు గుట్టు
రట్టయ్యేది చిట్ట చివరికేనేమో..
నిట్ట నిలువుగున్న ప్రతి వోడు
అడ్డం పడేదాకా అర్థం కాదేమో..
క్షణం తీరిక లేక ఆడినవాడను
ఇకపై కనులార్పకుండా చూసేవాడను
ఆడండి ఆడండి, అలిసేదాక ఆడండి
చూసి కాసంత రాక్షసానందం పొందుతా.
నాకోసం మరో లోకం తలుపు తీసిందక్కడ
మరో తల్లి కడుపు కాసుకు కూర్చుంది
పురిటి నొప్పులు కొన్ని, పుడమికి నొప్పులు కొన్ని
ధానమిచ్చి వస్తా, దయగల దరిద్రుడను నేను.