ఆకు తీసి ఊడ్చే వనితలు వయ్యారాలతో గానాలాడుతూ…

నింగి నుండి రాలిన నీటికి
నేలపై నెరలన్నీ నిండగా

నానిన నేలను రైతు
చదును చేసే వేళ,
నత్తలన్నీ పరుగు పరుగున
తేలే నేలపై, వాటికై హలం వెంట
కొంగల వేట నీటిపై తేలేటి అడుగులతో

విత్తనాల బుట్టను నడుంపట్టి
చల్ల సాగే రైతన్న మురిసిపోతూ

మొలకెత్తె విత్తనాలు వొత్తుగ
పచ్చని ముద్దుబంతి పువ్వుల్లె

ఆకు తీసి ఊడ్చే వనితలు
వయ్యారాలతో గానాలాడుతూ

నిలదొక్కుకున్న పైరు
పరుగు తీసే నిట్ట నిలువుగా

కొంకి పట్టే వరికి మోయలేనంతగా
బరువెక్కువై వరిగె పక్కకు గాలివాటుగా

తెలుసా గట్టు గట్టున చూడ
చోద్యంబు అన్నీ పీత బొక్కలే,
సునాయాసంగా ఒక్కొక్కటి పట్టి
పులిసెట్టి తినిపించె తల్లి కావలికి

కోతకు కేకలెట్టే పొలం, కోసి
పొనలు పొనలుగ తీసి కుప్పేసే రైతు

జల్లు జల్లున రాలే వడ్ల గింజలు
హోయ్ హోయ్ అంటూ రైతు
ఒక్కొక్క వరి కట్ట బండకేసి కొట్టంగ.

చాటేసి ఇసరంగ
చెత్తంత చెదరంగ
బస్తాలు నిండంగ
గుండంత నిండెగా రైతన్నకి
ఊరంత పండగే ఆ రాత్రికి

సురేష్ సారిక

ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don`t copy text!