అదిగదిగో అందరాని దూరాన ఓ చంద్రిక
చెయ్యి చాచినా, నిచ్చెనేసినా అందక.
ఎదురు చూసి కళ్ళు కాచిన నాకు
తలుకులొలుకుతూ తారసపడింది
ఒక్కసారిగా పసిప్రాయం కన్నుల్లో రెపరెప లాడింది
భద్రంగా దాచుకున్న జ్ఞాపకాలన్ని బయట పడ్డాయి
తనకై ఇన్నాళ్లుగా రాసుకున్న భావాలన్నీ పలుకులయ్యాయి
ఆ పలుకులు మోహమాటపు తెరలు దాటి ఉరకలేసాయి
గారడీ ప్రపంచమిది ఇట్టే జ్ఞాపకాలను తుడిచేస్తుందిగా
తప్పక, నన్ను నేనే మరోసారి పరిచయం చేసుకున్నా
ఎల్లపాటు సాగిన నిరీక్షణకు
రెప్పపాటు క్షణాల వసంతమిది
ఉప్పెనంటి వర్షానికి
దోసిలిలో మిగిలిన చినుకులివి
మనసులకి కొదవేంటి
మరో తోడు కాచింది
వేలు విడవక వెంట సాగుతుంది.
వీలు చూసుకుని, వేల కాచుకుని
చీకటి దాటి బయటకొచ్చి తొంగిచూస్తుంది.
ఆగలేని మనసు ఎంతలా కోరుకుంటున్నా
సంకెళ్లు తెంచుకుని, సరిహద్దులు దాటలేను.
మోయలేని బరువెక్కిన జ్ఞాపకాలతో
ఎన్నటికీ నిను చేరలేననే నిజంతో
కన్నీటి కన్నులతోనే కలలు కంటూ
నచ్చేలా ఊహాలలో నిన్ను చూస్తూ
ఉప్పొంగిపోతున్నా చిమ్మ చీకటిలోనే.
సురేష్ సారిక