పల్లెటూరి చాకి రేవు బండ పై మోగిన వాద్యాలెన్నో బట్టను బండపై బాదుతూ తీసిన కూని రాగాలెన్నో పెద్దన్న చూసినావానాడే పేడుపట్టినట్టి మురికట్టిన బట్ట బతుకులెన్నో ఉతికి ఉతికి మురికి ఊడగొట్టి జాడిచ్చి వదిలిన బట్ట బతుకు గోసలెన్నో ఆ నోట ఆ నాడే పల్కినావు నిక్కమైన నీతి పాఠాలెన్నో బరువెక్కువై తడబడు అడుగులనాపకుండా ఈడ్చుకుంటూ పొమ్మంటు చిత్రంగా చెబుతుంటివి. ఓపిక లేక కళ్ళు బైర్లు కమ్మిన నాడు భగవంతుడిపై బారమేసి అడుగులోన అడుగేసి ముందుకెళ్ళాలంటివి గట్టుపైనో లేక ఏటిలోనో నీ బతుకు ఎట్టాగొట్టా కొట్టుకుపోతాదంటివి ఆది అంతాల నడుమ పంతాలు ఎందుకంటివి ప్రేమతో పది మందిని కూడబెట్టుకోమంటివి ఆకలి తీర్చే మార్గమేదైన ధర్మం అంటివి ఆశలకై పట్టే దారిని మెలుకువుగా పట్టమంటివి జీవితాలను చూసి మోగినోడివి నువ్వు ఉప్పు నీరు నీ గొంతు చేరి గార్లపట్టిన కంఠం కఠినంగా మోగిందొ ఏమో మా సెవులు విననంటూ ముడుసుకుపోయే. ఆ కర్మఫలమీనాడు వదలక వెంటాడుతుండగా చచ్చుబడిన మెదడుకి అక్షరాలే అర్థం కాక వెనుతిరిగి ముందడుగు వేస్తున్నాం.. నే చెప్పేందుకు ఏముంది ఈనాడు కాగితాలు చదివి తెలుసుకున్న కధలు తియ్యంగా పల్కెడి గొంతు నాదయ్యే. పసివాడి నోట ఏది పల్కినా చిత్రంగా వింటాది ఈ ముసలి లోకం. సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
+1
1
+1
+1