Telugu Poetry on Writing · June 13, 2021 0

ఇదే ఈ నాటి రాత, ఇదే ఈ నాటి కవిత.

తియ్యని ప్రేమల రుచులు 
కటినమైన వేదన గుర్తులు 

అందమంటే 
జారే జలపాతాలు
వికసించే కుసుమాలు
వెన్నెల వెలుగులు
తారల మిళమిళలు

రైతుపై రవ్వంత జాలి
సైనికుడంటే త్యాగశీలి

తల్లిదండ్రులపై అబద్ధపు ప్రేమ
స్నేహితుడే దేవుడిచ్చిన వరం

రోజుకుక దినం వుందిగా
రాసేందుకు అదే నాకు ఆదర్శం

ఇదే ఈ నాటి రాత, 
ఇదే ఈ నాటి కవిత.

మొలకెత్తే విత్తు అందమే కాని
దాని పురిటి నొప్పులు నాకెక్కవు

అందమైన నీటి తీగలే కానీ
అవి పాకిన దారులు నాకెందుకు

కడలి తీరం దాటదు నా ఆలోచన
అలల అడుగు తాకదు నా ఆలోచన

వెండి బండ వెనుక ఏముందో తెలియదు
ఉప్పు నీటి గుండపు లోతు నాకు తెలియదు

పతనమైన వ్యవస్థలు నాకు కనబడవు
వ్యాపారమైన రాజకీయం నేను ఎరుగను
నియంతలైన నాయకులను నిందించను

పెంచి పోషింపబడుతున్న రాక్షసత్వం నాకు అనవసరం
సామాన్యుడి చేతే సమాజంపై 
రాళ్లు విసిరిస్తున్నోడు నాకు అనవసరం

ప్రపంచాన కాన్పును మించింది లేదు
పెంపకం ఎలా వుంటే నాకెందుకు

సుఖాలకై కన్న బిడ్డలను కడతేర్చుతున్న 
తల్లిదండ్రుల గురించి మాట్లాడను, 
ఎందుకంటే పాపం.

అవినీతి చేస్తున్న వెధవల గురించి మాట్లాడను
ఎందుకంటే భయం. 

మెప్పుకోసమే నా రాతలు
కుక్కలా దాని వెనకే నా అక్షరాలు

నా జబ్బ నేనే చరుచుకుంటా
నా కన్నా మొనగాడు లేడంటా

ఇదే ఈ నాటి రాత, 
ఇదే ఈ నాటి కవిత.

సురేష్ సారిక
Don`t copy text!