ఉద్యోగముందని పిలుపొచ్చింది
నాకన్నా మొనగాడెవడని
కాగితాలట్టుకుని అట్టే పోయా
పిచ్చి పిచ్చి ప్రశ్నలడిగి
నువ్వు పనికి పనికిరావని
నవ్వులు చిమ్ముతూ
బయటకి సాగనంపారు
రోడ్డెక్కా
ఉద్యోగాలు లేవని
ప్రభుత్వంపై నిరసన చేపట్టా
నా దేశం నాకేమి ఇవ్వలేదని
కోపంతో ఊగిపోయా .. ..
మరుసటి రోజు మరో చోటికి వెళ్తే
వారును ఏవేవో ప్రశ్నలడిగి
నువ్వు దీనికి సరి కాదని
సరిచేసుకు రమ్మన్నారు
బ్రతిమిలాడా
పని రాకపోయినా
పని చెయ్యకపోయినా
కడుపు నింపమని
ఇంకా సత్రం తెరవలేదని
తెరిచాక కబురెడతామని
మెడబట్టుకుని పద్దతిగా
బయటకి పరిగెట్టించారు
మళ్ళీ రోడ్డెక్కా
నాలాంటి నలుగురిని పోగేసా
నాలుగు కర్రలు పట్టుకుని
కనిపించిందల్లా నాశనం చేసా
అగ్గిపుల్ల వెలిగించి విసిరేసా
ఆ అగ్గి
అక్కడే రోడ్డుపక్కన
రెక్కలు ముక్కలుగా
కష్టపడుతున్నోడికి అంటుకుంది.
ఆర్తనాథాలు.. చుట్టూరా
అవి నాకినపడనే లేదు
నా ఆవేశపు గర్జనల ముందు
అవి మూనుగుతున్నట్టున్నవి.
కాలం గడిచింది
నాన్నతో పొలాన అడుగెట్టా
తెలిసిన పని, నాకొచ్చిన పని
వెనకకు తిరిగి చూడలేదు
పదింతలైంది పంట
ఎదిగా.. కనివిని ఎరుగని రీతిగా
వ్యాపారం మొదలైంది
సహాయం కోరింది .. ..
పిలిచా పనికి ఒకరిని, ప్రశ్నలడిగా
నేనకున్న సమాధానం నాకినపడలేదు
ఈ పనికి నువ్వు పనికిరావని చెప్పా .. ..
హఠాత్తుగా నోట మాట ఆగింది
ఒక్కసారిగా నా గతం మదిలో మెదిలింది
రోడ్డెక్కి నేచేసిన ఆవేశపు విధ్వంసం
ఇన్నాళ్లకు తెలిసొచ్చింది
లేనిది అవకాశమా లేక హర్హతా
నేనెత్తి చూపిన వేలు సరి కాదని
ఎన్నేనో అవకాశాలున్నాయని
ఆనాడు నేనాటికి సిద్ధంగా లేనని
నన్ను నేనే చీదరించుకున్నా ..
సమాజం ముందుకొచ్చి
సిగ్గుతొ తలదించుకున్నా .. ..
సురేష్ సారిక