ఈ పువ్వుకెందుకు అంత సిగ్గు
పొద్దుగూకాకే విచ్చుకుంటుంది..!
చల్లగాలికి తుళ్ళిపడి నిద్ర లేచిందా..! లేక,
ఆ చంద్రరూపం చూడకోరి తలుపు తెరిచిందా..!
రాతిరంతా కలలుకంటూ, పగటి పూట
తనను తాకే చేతి కోసం,
తాను చేరే చోటు కోసం
తనతో తానే ముచ్చటిస్తూ ..
మురిసిపోయిందా .!
తెల్లవారే సరికి
సిరి కొప్పులోకో లేక
హరి పాదాల దరికో
చేరెందుకు సిద్ధపడతుంది.
చేరకుంటే ఆ నాడే
అలిగి వడిలిపోతుంది
ముడుచుకుంటుంది.
తొడిగిన తొడుగులు
ఒకొక్కటిగా వదిలేస్తూ
ఎండిపోయి
రాలిపోతుంది
మట్టిలోన కలిసిపోతుంది.
మరునాడు
మరో కొమ్మకు
తాను బిడ్డ అవుతుంది.
ఈ నాడైనా
తన రుణం తీరుతుందని
ఆశ పడుతుంది.
సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
1
+1
+1
+1